Friday, September 19, 2025
Homeతాజా వార్తలుబాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

రెంజల్ లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ

అస్త్రం/బోధన్ : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు.

ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కింద ఇటీవలే నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు.


అనంతరం కలెక్టర్ రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కాగా, పాఠశాలలో 418 మంది విద్యార్థినులు కొనసాగుతున్నారని, పాఠశాలకు కొత్త బియ్యం నిల్వలు కేటాయించినందున వండిన సమయంలో అన్నం కొంత మెత్తగా అవుతోందని పాఠశాల ప్రిన్సిపాల్ అర్షియా నజమ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్ డీ.ఎం కు ఫోన్ చేసి పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పాత బియ్యం నిల్వలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments