అస్త్రం ఎడపల్లి; ఎడపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలు రసాభాసగా మారాయి. మండలంలో మంగళవారం ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలు నిర్వహించగా పలుచోట్ల అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుర్నాపల్లి, మంగల్పాహాడ్ గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల పేర్లు లిస్టులో లేకపోవడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు చదివి వినిపించిన జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు.గతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదని ఇప్పుడు అనర్హులను ఎంపిక చేస్తే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు.ఎంపిక పారదర్శకంగా జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. కుర్నాపల్లి గ్రామంలో పలువురు గ్రామస్తులు గ్రామ సభలో ఉన్న అధికారులపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ ఉపాధిహామీ కూలీ డబ్బులు సైతం రాలేదని ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సభలో గందరగోళం సృష్టించారు.దీంతో సమాచారం అందుకొన్న బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు అక్కడికి చేరుకొని గ్రామస్తులను శాంతింప జేశారు.ఈసారి పథకాలకు అర్హులుగా ఎంపిక కాలేకపోయినవారు నిరాశ చెందవద్దని, ఐదు రోజులోపు మరోసారి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీఇచ్చారు.