Tuesday, March 18, 2025
Homeతాజా వార్తలువర్నిలో సీ.హెచ్.సీ, పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

వర్నిలో సీ.హెచ్.సీ, పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, జనవరి 29 : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీ.హెచ్.సీ లోని లేబొరేటరీ రూమ్, ఇన్ పేషంట్ వార్డ్, హెల్ప్ డెస్క్, వ్యాక్సినేషన్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. డ్రగ్ స్టోర్ రూమ్ లోని మందుల నాణ్యత, వాటి కాలపరిమితిని చెక్ చేశారు. ప్రతిరోజూ ఎంతమంది రోగులు సందర్శిస్తారు, ఎంతమంది ఇన్ పేషంట్లుగా చేరుతున్నారు, సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారా? అన్ని రకాల మందులు ఆసుపత్రిలోనే ఉచితంగా అందిస్తున్నారా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జ్వరం వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రతి ఒక్కరు సమయ పాలన పాటిస్తూ, మెరుగైన సేవలు అందించాలన్నారు.
అనంతరం కలెక్టర్ పాత వర్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, జ్యోతిబాపూలే గురుకులాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు పరిశీలించారు.

స్టోర్ రూమ్ , కిచెన్ లను తనిఖీ చేసి బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయల సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నిర్వాహకులను ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును కలెక్టర్ పరిశీలించారు. ఐదవ తరగతి విద్యార్థినులతో ఆంగ్లం సబ్జెక్టులోని పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత స్థానాలలో రాణించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. కాగా, ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తేగా, అదనపు తరగతి గదులను మంజూరు చేస్తామని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments